బషీర్ బాగ్, వెలుగు: న్యాయవ్యవస్థ గురించి తెలుసుకోవాలనుకునే వారు తప్పకుండా లీగల్ ఎగ్జిబిషన్‌ను సందర్శించాలని తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవి దేవి సూచించారు. నారాయణగూడలోని కేశవ మెమోరియల్ లా కాలేజీలో ఏర్పాటు చేసిన మూడు రోజుల లీగల్ ఎగ్జిబిషన్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. రాజ్యాంగం ప్రాధాన్యత, న్యాయవ్యవస్థ పనితీరును కళ్లకు కట్టినట్టు వివరించేలా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఎంతో బాగుందన్నారు.
జ్యుడిషియల్ వ్యవస్థ ఎలా ఉంది? న్యాయం ఎలా పొందొచ్చు? అనే విషయాలను చక్కగా వివరించారని చెప్పారు. లా అంటే కేవలం థియరీనే కాదని.. ఇలా ఎగ్జిబిషన్లు నిర్వహించి, అనేక విషయాలను ప్రాక్టికల్‌గా వివరించొచ్చని అన్నారు. ఇలాంటి లీగల్ ఎగ్జిబిషన్స్‌ను అన్ని కాలేజీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి సైతం ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన క్రైం సీన్ రీ కన్‌స్ట్రక్షన్, హైకోర్టు నమూనా ఆకట్టుకున్నాయి. కాలేజీ ఫ్యాకల్టీ, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.