![పార్లమెంటులో మహిళా బిల్లు పెట్టాలి: హైకోర్టు జడ్జి జస్టిస్ సూరేపల్లి](https://static.v6velugu.com/uploads/2023/01/High-Court-Judge-Justice-Surepalli-Nanda_GECzyprHTZ.jpg)
ఖైరతాబాద్, వెలుగు : రాజకీయాల్లో మహిళా సాధికారత పెరగాలని హైకోర్టు జడ్జి జస్టిస్ సూరేపల్లి నందా అన్నారు. పార్లమెంటులో మహిళా బిల్లు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం హైదరాబాద్ లో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల సింపోజియం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేదరికం బీసీలకు పెద్ద శాపం అని, పేదరికం వల్ల బీసీల్లో చాలా మంది చదువుకోలేకపోతున్నారన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ వివక్ష ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనిలో వారికి వేతనం తక్కువ ఇవ్వడంతో పాటు ప్రమోషన్లలోనూ వివక్ష చూపిస్తున్నారన్నారు. ఆడవారు రాజకీయాల్లోనూ రావాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాష్ట్ర గవర్నర్ తమిళిసై రాజకీయ సాధికారతకు నిదర్శనమని జస్టిస్ నందా వ్యాఖ్యానించారు. బీసీ సమాజ్ వైస్ ప్రెసిడెంట్ నాగపరిమళ మాట్లాడుతూ చదువుతోనే మహిళా సాధికారత లభిస్తుందన్నారు. అనవసర భయాలతో ఆ కాలంలో ఆడపిల్లలను చదువుకు దూరం చేశారని, సావిత్రీ బాయి పూలే వచ్చాకే బాలికలకు విద్య అందిందన్నారు. ఈ కార్యక్రమం లో బీసీ సమాజ్ ప్రెసిడెంట్ సంగెం సూర్యారావు, ప్రధాన కార్యదర్శి శంకర్ ముదిరాజ్, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రెండు వందల మంది బీసీ సమాజ్ మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.