- చేర్యాలలో కోర్టు ప్రారంభం
చేర్యాల, వెలుగు: ప్రజలకు సత్వర న్యాయం అందాలంటే లాయర్లు ఉత్సాహంగా పనిచేయాలని హైకోర్టు జడ్జి విజయసేన్ రెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో ఫస్ట్ క్లాస్ సివిల్ జూనియర్ కోర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేర్యాల, కొమురవెల్లి, ధూల్మిట్ట, మద్దూర్ ప్రాంత ప్రజలకు న్యాయ సేవలను అందించేందుకు చేర్యాల పట్టణంలో కోర్టును ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్లో ఆర్టీఫిషియల్ఇంటెలిజెన్స్ న్యాయ వ్యవస్థలో కీలకపాత్ర పోషించనున్నదన్నారు.
కుటుంబ తగాదా కేసులను సామాజిక స్పృహతో పరిష్కరించాలన్నారు. సీనియర్ లాయర్లు జూనియర్ లాయర్లకు అవకాశాలు కల్పించి వారు వృత్తిపరంగా ఎదిగేలా ప్రోత్సహించాలన్నారు. జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి సాయి రమాదేవి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థకు ప్రముఖ స్థానం ఉందని చేర్యాలలో కోర్టు ఏర్పాటుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
అడిషనల్కలెక్టర్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ.. ఈ ప్రాంత అభివృద్ధికి కోర్టు ఏర్పాటు చాలా అవసరమన్నారు. సిద్దిపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ చేర్యాలలో కోర్టు ఏర్పాటు 20 ఏళ్ల కల అని దానిని సాకారం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీసీ కమిషన్ మెంబర్ బాలలక్ష్మి, హైకోర్టు జడ్జిని శాలువాలతో సన్మానించారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా దివ్యాంగులకు ఉపకరణాలను అందజేశారు. మెదక్ జిల్లా జడ్డి, సిద్దిపేట, జనగామ, గజ్వేల్, దుబ్బాక, మెదక్, నర్సాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు, లాయర్లు, ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు.