హైదరాబాద్, వెలుగు: అమెరికా నుంచి తీసుకువచ్చిన బాలుడిని అక్కడే ఉన్న తల్లికి అప్పగించాలంటూ ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బాలుడి ప్రయోజనాలను, విదేశీ కోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుని తల్లికే కుమారుడిని అప్పగించాలని స్పష్టం చేసింది. అమెరికాలో 2019 అక్టోబరులో జన్మించిన సాత్విక్ ను..తండ్రి ఉమేశ్ బయరాజు అక్రమంగా ఇండియాకు తెచ్చాడు. దాంతో అమెరికాలోని సాత్విక్ తల్లి సారా బయరాజు..హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ పి.శ్యాంకోశీ, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ సారా తరఫు న్యాయవాది వాదిస్తూ..2019లో ఉమేశ్‌తో వివాహం జరగ్గా అదే ఏడాది అమెరికాలో సాత్విక్ జన్మించారన్నారు. తరువాత విభేదాలతో 2022లో దంపతులు విడాకులు తీసుకోగా..సాత్విక్ బాధ్యతను అమెరికా కోర్టు ఇద్దరికీ అప్పగించిందన్నారు. తరువాత కుమారుడికి ఆటిజం ఉండటంతో చికిత్స నిమిత్తం మరో రాష్ట్రానికి ఇద్దరూ కలిసి సాత్విక్‌తో వెళ్లారని, అక్కడ హింసించడంతో భర్తపై కేసు నమోదైందన్నారు. దీంతో కుమారుడిని తీసుకుని ఉమేశ్ ఇండియా వచ్చేశారన్నారు.
ఈ విషయం తెలిసిన అమెరికా కోర్టు.. బాలుడిని తల్లికి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఉమేశ్ వ్యక్తిగతంగా వాదిస్తూ.. నాలుగున్నరేండ్లల్లో కుమారుడి ఆరోగ్యం మెరుగుపడిందని, ప్రస్తుతం కొన్ని మాటలు కూడా వస్తున్నాయన్నారు. అంతేగాకుండా తల్లి మానసిక, ఆర్థిక సమస్యలతో ఉందని, అందువల్ల కుమారుడి సంరక్షణ బాధ్యతను తనవద్దే ఉంచాలన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం..మైనర్‌ను ఉమేశ్ తీసుకురావడం అక్రమ నిర్బంధమని పేర్కొంది.
బాలుడు అమెరికాలో పుట్టడంతో అతని సంక్షేమం అమెరికా కోర్టు పరిధిలోనే అత్యుత్తమంగా ఉంటాయని తెలిపింది. విదేశీ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి భారత దేశానికి బాలుడిని తీసుకువచ్చారని వివరించింది. అందువల్ల బాలుడిని తల్లికి అప్పగించాలని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల అమలు నివేదికను ఈ నెల 24లోగా రిజిస్ట్రీకి అందజేయాలని మలక్ పేట ఎస్‌హెచ్‌వోకు సూచించింది.