సివిల్‌‌‌‌ సూట్‌‌‌‌లను విచారించే పరిధి ఐటీడీఏ పీవోలకు లేదు... హైకోర్టు

సివిల్‌‌‌‌ సూట్‌‌‌‌లను విచారించే పరిధి ఐటీడీఏ పీవోలకు లేదు... హైకోర్టు
  • ఆ అధికారం కేవలం కలెక్టర్లదే 

హైదరాబాద్, వెలుగు: ఏజెన్సీ ప్రాంతాల్లో సివిల్‌‌‌‌ సూట్‌‌‌‌(దావా)లను విచారించే పరిధి ఐటీడీఏ(ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌‌‌‌మెంట్ ఏజెన్సీ) ప్రాజెక్ట్‌‌‌‌ అధికారి(పీవో)కి లేదని హైకోర్టు తెలిపింది. అ అధికారం జిల్లా కలెక్టర్లకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ఓ సివిల్‌‌‌‌ వివాదంలో డాక్యుమెంట్‌‌‌‌లను చేతిరాత నిపుణులకు పంపాలన్న అభ్యర్థనను తిరస్కరిస్తూ ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఉత్తర్వులను జారీ చేశారు. దాన్ని సవాల్ చేస్తూ ఉట్నూరు మండలం హస్నాపూర్‌‌‌‌ గ్రామానికి చెందిన చవన్‌‌‌‌ ప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించారు.

విచారణ సందర్భంగా.. సివిల్‌‌‌‌ సూట్‌‌‌‌లను ఐటీడీఏ పీవో ఏ అధికారంతో విచారిస్తున్నారని  కోర్టు ప్రశ్నించింది. 2002లో అప్పటి ఆదిలాబాద్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ ప్రొసీడింగ్స్‌‌‌‌ జారీ చేసి.. అదనపు ఏజెంట్‌‌‌‌గా ఐటీడీఏ పీవోకు సివిల్‌‌‌‌ సూట్‌‌‌‌లను విచారించే బాధ్యతలు అప్పగించారని ప్రస్తుత కలెక్టర్‌‌‌‌ వెల్లడించారు. ఆ ఉత్తర్వుల ప్రకారమే ఆదిలాబాద్‌‌‌‌తోపాటు నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీమ్ అసిఫాబాద్‌‌‌‌ జిల్లాల పరిధిలోని సివిల్‌‌‌‌ సూట్‌‌‌‌లను భూబదలాయింపు నిబంధన, ఏజెన్సీ నిబంధనల కింద ఐటీడీఏ పీవో విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.

కలెక్టర్‌‌‌‌ సమర్పించిన నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి.. ప్రభుత్వ ఏజెంట్‌‌‌‌గా కలెక్టర్లకు ఉన్న అధికారాన్ని ఐటీడీఏ పీవోకు బదలాయించడానికి వీలులేదని తెలిపారు. ఇది జీవో 193, 274లకు విరుద్ధమన్నారు. అయితే, ఏజెన్సీ నిబంధనల్లోని 11(2) ప్రకారం ఏదేని ప్రత్యేకమైన సూట్‌‌‌‌ను కింది అధికారులకు అప్పగించవచ్చని..అయితే, దానికి గవర్నరు/ప్రభుత్వం అనుమతి అవసరమని వివరించారు. వారి అనుమతి లేకుండా సివిల్‌‌‌‌ సూట్‌‌‌‌లను విచారించే పరిధిని ఐటీడీఏ అధికారికి అప్పగించడం చెల్లదని వెల్లడించారు. చవన్‌‌‌‌ ప్రకాశ్ కేసులో  ఉట్నూరు ఐటీడీఏ పీవో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ కేసును కలెక్టర్‌‌‌‌కు బదలాయించాలని ఆదేశించారు. అంతేగాకుండా పెండింగ్‌‌‌‌లో ఉన్న సూట్‌‌‌‌లను ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమ్రంబీమ్–అసిఫాబాద్‌‌‌‌ కలెక్టర్లకు రెండు నెలల్లో బదలాయించాలని స్పష్టం చేశారు. వాటిని ఇరుపక్షాలకు నోటీసులిచ్చి ఏజెన్సీ నిబంధనల ప్రకారం విచారణ చేపట్టాలని కోర్టు పేర్కొంది. ఈ ఉత్తర్వుల అమలు నివేదికను తెప్పించి సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్‌‌‌‌ జనరల్‌‌‌‌కు సూచించింది.