భద్రాచలం కోర్టును సందర్శించిన హైకోర్టు జడ్జి

భద్రాచలం కోర్టును సందర్శించిన హైకోర్టు జడ్జి

భద్రాచలం, వెలుగు :  తెలంగాణ హైకోర్టు జడ్జి సురేపల్లి నంద  ఆదివారం భద్రాచలం జ్యుడిషియల్​ కోర్టును సందర్శించారు. కోర్టు ప్రాంగణంలో ఆమె పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం భద్రాచలం జడ్జి శివనాయక్​, ఏఎస్పీ విక్రాంత్​కుమార్​ సింగ్​లతో కలిసి ఆమె కోర్టులో మొక్కను నాటారు. అంతకుముందు భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు.

ఆమెకు ఈవో రమాదేవి ఆధ్వర్యంలో వేదపండితులు మేళతాళాలతో స్వాగతం పలికారు. గర్భగుడిలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు. ఈవో రమాదేవి ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు.

లీగల్​ అవేర్​ నెస్​లో కీలక పాత్ర వహించాలి

భద్రాద్రికొత్తగూడెం :  లీగల్​ అవేర్​ నెస్​ ప్రోగ్రాంలలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించాలని హైకోర్టు న్యాయమూర్తి నందా సూరేపల్లి అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా కోర్టు ఆవరణలో నిర్మించిన వెయిటింగ్​ హాల్స్​ ను ఆమె ప్రారంభించా మాట్లాడారు. కోర్టుకు విచారణ కోసం వచ్చే ప్రజలకు మెరుగైన సౌకర్యాలను అందించడానికి, న్యాయ సేవలకు మరింత వృద్ధి కలిగించేందుకు ఈ హాల్స్​ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు.

న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రభుత్వ న్యాయ సేవల సంస్థల భాగస్వామ్యం ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉందన్నారు. ఈ ప్రోగ్రాంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్​ వసంత్​, కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్, ఎస్పీ బి.రోహిత్​ రాజు, జిల్లా లీగల్​ సర్వీసెస్​ అథారిటీ సెక్రటరీ జి. భానుమతి, ప్రిన్సిపల్​ సీనియర్​ సివిల్​ జడ్జీ బత్తుల రామారావు, జడ్జీలు కె. సాయిశ్రీ, శివనాయక్​, కె. సూరిరెడ్డి, డాక్టర్​ బి. భవాని, కొత్తగూడెం బార్​ అసోసియేషన్​ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ పాల్గొన్నారు.

పెద్దమ్మతల్లికి పూజలు.. 

పాల్వంచ :  పాల్వంచ మండలంలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో హైకోర్టు జడ్జి  మారేపల్లి నంద పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆమెకు శేష వస్త్రం బహుకరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా ఆదివారం కావడంతో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.