హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయడంలేదన్న హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయకపోవడాన్ని కోర్టు ధిక్కరణ కింద ఎందుకు పరిగణించకూడదో చెప్పాలంటూ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, కాళోజీ నారాయణరావు వైద్యవిశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సంధ్యకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టుకు హామీ ఇచ్చి ఉత్తర్వులను ఉల్లంఘించడంపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధనల ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చి అమలు చేయకపోవడంపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావుతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు ఉత్తర్వులను ఈ మెయిల్ ద్వారా పంపినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందన్నారు. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన అధికారులను కోర్టు ధిక్కరణ కింద శిక్షించాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం అధికారులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.