- భువనగిరి కలెక్టర్, ఇతర అధికారులకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు : ఒక రైతు నుంచి సేకరించిన భూమికి మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలన్న గత ఉత్తర్వులను అమలు చేయనందుకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తుర్కపల్లి మండలం గోపాలపల్లిలో వాటర్ ట్యాంక్, స్కూల్, బస్టాండ్ కోసం సేకరించిన భూమికి పరిహారం చెల్లించాలని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో స్వయంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సహా భువనగిరి ఆర్డీవో, తుర్కపల్లి ఎంపీడీవో, ఎమ్మార్వోను ఆదేశించింది.
వచ్చే నెల 5న హాజరు కావాలని సూచించింది. మీపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోరాదో, శిక్ష ఎందుకు విధించరాదో వివరణ ఇవ్వాలని అడిగింది. ఈ మేరకు జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి మంగళవారం నోటీసులు జారీ చేశారు. మార్కెట్ ధర మేరకు పిటిషనర్‌కు పరిహారం చెల్లించాలని 2022 ఆగస్టులో ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు అమలు చేయలేదని గోపాలపురానికి చెందిన రహీముద్దీన్ కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పిటిషనర్ 85 ఏండ్ల వృద్ధుడని, మార్కెట్ రేటు మేరకు పరిహారం చెల్లించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను అధికారులు
డివిజన్ బెంచ్ ఎదుట అప్పీల్ చేస్తే దానిని కొట్టివేసిందని న్యాయవాది వివరించారు. కోర్టు ఆదేశాల తర్వాత కూడా ప్రభుత్వాధికారులు పరిహారం చెల్లించలేదన్నారు. అందుకే కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయాల్సి వచ్చిందని వివరించారు. వాదనలు విన్న తర్వాత హైకోర్టు, కలెక్టర్ ఇతర అధికారులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది.