హైదరాబాద్, వెలుగు : దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ కుమార్ భార్య శ్యామల రమావత్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గాజినగర్‌లో ఆమెకు సంబంధించిన స్టోన్ క్రషర్ కు అనుమతులు ఇవ్వడంపై గురువారం చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ భాస్కర్‌రెడ్డిల బెంచ్ విచారణ జరిపింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గనుల శాఖకు అందజేసిన తనిఖీ రిపోర్టును సవాల్ చేస్తూ కొండమల్లేపల్లికి చెందిన కె.అంజయ్య హైకోర్టులో సవాల్ చేశారు.
మైనింగ్‌కు అనుమతి ఇచ్చిన ల్యాండ్‌కు సమీపంలో పిటిషనర్‌కు 58 ఎకరాల భూమి ఉందని, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లు ఉన్నాయని, చెరువులు కూడా ఉన్నాయని, మైనింగ్ జరిపితే అవన్నీ కాలుషితం అవుతాయని న్యాయవాది వాదించారు. పీసీబీ రిపోర్టును రద్దు చేయాలని, గ్రామస్తుల నిరసనను పట్టించుకోవాలని కోరారు. వాదనల తర్వాత ఎమ్మెల్యే భార్య రమావత్, పీసీబీ, రెవెన్యూ, మైనింగ్ శాఖలకు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే భార్య వ్యక్తిగత ప్రతివాదిగా ఉన్నారు. విచారణ డిసెంబర్ 29కి వాయిదా పడింది.