స్టడీ సర్టిఫికెట్లలో పేరు మార్చేందుకు ఇబ్బందేంటి : హైకోర్టు

  • ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: స్టడీ సర్టిఫికెట్లల్లో స్టూడెంట్ల పేరు మార్చడానికి ఉన్న ఇబ్బంది ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌సీ, ఇంటర్‌‌‌‌ బోర్డు, ఉస్మానియా యూనివర్సిటీ మొదలైనవి విద్యార్థుల శ్రేయస్సు కోసమే ఉన్నప్పుడు వారికి అనుగుణంగా సర్టిఫికెట్లను ఎందుకు జారీ చేయట్లేదని నిలదీసింది. పేరు మార్చి సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఉన్న సమస్యలు ఏమిటో  చెప్పాలని ఆదేశించింది. దీనిపై కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

రంగారెడ్డి జిల్లా హయత్‌‌‌‌నగర్‌‌‌‌కు చెందిన వి.మధుసూదన్‌‌‌‌రెడ్డి.. స్టడీ సర్టిఫికెట్లల్లో పేరు మార్చుకునేందుకు టెన్త్, ఇంటర్‌‌‌‌ బోర్డులు, ఉస్మానియా యూనివర్సిటీ అంగీకరించడం లేదంటూ హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. తన పేరు మార్చుకున్నట్లు ప్రభుత్వం గెజిట్‌‌‌‌ కూడా ఇచ్చిందన్నారు.  దీన్ని చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌ అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌ జూకంటి డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ గురువారం విచారించింది. పిటిషనర్‌‌‌‌ అడ్వకేట్ వాదిస్తూ..సర్టిఫికెట్లలో పేరు మార్చేందుకు బోర్డులు నిరాకరించడం సరికాదని కోర్టుకు తెలిపారు.

ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఒకసారి పేరు మారుస్తూ గెజిట్‌‌‌‌ జారీ అయ్యాక ఇక సర్టిఫికెట్‌‌‌‌ మార్పు అవసరం లేదని, గెజిట్‌‌‌‌లోని పేరే చెల్లుబాటు అవుతుందన్నారు. దీనిపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది.  పిటిషనర్‌‌‌‌ విజ్ఞప్తి న్యాయబద్ధమైనదని తెలిపింది. ఇలాంటి వారు పరీక్షలకు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో దరఖాస్తు చేసే సమయంలో  మారిన పేరునే రాస్తారని..అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసే సర్టిఫికెట్లలో మాత్రం పాత పేరే ఉంటుందని చెప్పింది.  దాని వల్ల పరీక్ష రాయడానికి అనర్హులు అవుతారని వెల్లడించింది. ఆ నష్టాన్ని ఎవరు పూడుస్తారని నిలదీసింది.

విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేస్తున్న బోర్డులు, వర్సిటీలు గెజిట్‌‌‌‌ ప్రకారం పేరు మార్చి సర్టిఫికెట్‌‌‌‌ ఇస్తే నష్టమేంటని ప్రశ్నించింది. దీనిపై వివరాలు తెలియజేసేందుకు గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీనికి అనుమతించిన ధర్మాసనం.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. తదుపరి విచారణలోగా పిటిషనర్‌‌‌‌కు సర్టిఫికెట్లలో పేరు మార్చి ఇస్తారని భావిస్తున్నామని వ్యాఖ్యానించింది.