హైదరాబాద్, వెలుగు: అనధికారిక లేఔట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. లేఔట్ల క్రమబద్ధీకరణ నిమిత్తం పురపాలకశాఖ జులై 30న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ కరీంనగర్‌కు చెందిన జువ్వాడి సాగర్‌రావు హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. భూమి విలువ ఆధారంగా నిర్మాణాలకు అనుమతి మంజూరుకు ముందు లేఔట్‌ల క్రమబద్ధీకరణ ఫీజు వసూలు చేయడం చట్టవిరుద్ధమన్నారు.
ఇది తెలంగాణ పట్టణ ప్రాంతాల అభివద్ధి చట్టం, జీహెచ్‌ఎంసీ చట్టం, తెలంగాణ టౌన్‌ప్లానింగ్ చట్టం, హెచ్‌ఎండీఏ చట్టాలకు విరుద్దమన్నారు. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని, ఇప్పటికే జారీ చేసిన అనుమతులను కూడా కొట్టేయాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.