హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఘాన్సీమియాగూడ పంచాయతీని శంషాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేయడంపై ప్రభుత్వానికి గురువారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే, పంచాయతీని విలీనం చేస్తూ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ అమలును నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఘాన్సీమియాగూడ పంచాయతీని శంషాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఈ నెల 2న జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ అదే పంచాయతీకి చెందిన టి.సిద్ధయ్య మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావుతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు సీనియర్ అడ్వొకేట్ సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. విలీనం ద్వారా ప్రతి పనికీ శంషాబాద్ వెళ్లాల్సి వస్తుందని, అంతేకాకుండా పన్నుల భారం పడుతుందన్నారు. తమ గ్రామం ఔటర్ రింగ్ రోడ్డుకు 7 కిలోమీటర్ల ఆవల ఉందని తెలిపారు. అందువల్ల దీన్ని మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని కోరారు.
వాదనలు విన్న ధర్మాసనం పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయడం ద్వారా మెరుగైన వసతులు ఏర్పడతాయని వ్యాఖ్యానించింది. అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించింది. మున్సిపాలిటీలో విలీనం చేయడం ద్వారా సౌకర్యాలు పెరిగి తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయంది. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన సాధారణ పరిపాలన పురపాలక, పంచాయతీ శాఖల ముఖ్యకార్యదర్శులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శంషాబాద్ మున్సిపాలిటీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 26వ తేదీకి వాయిదా వేసింది.