హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో స్థానిక ప్రజలతో వార్డు కమిటీలు ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం.. అందుకు విరుద్ధంగా మున్సిపల్ అధికారులతో వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేసిందంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ ఎం.పద్మనాభ రెడ్డి దాఖలు చేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. వార్డు కమిటీలను ఏర్పాటు చేయకపోవడంపై సమగ్ర వివరాలను అందజేయాలని ప్రతివాదులైన చీఫ్ సెక్రటరీ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసింది.
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. పిటిషనర్ తరఫు లాయర్ కేవీ రాజశ్రీ వాదనలు వినిపిస్తూ.. నిబంధనల స్థానిక ప్రజలతో వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కమిటీలు ఆయా వార్డుల్లోని పలు సమస్యలపై చర్చించి అధికారులకు నివేదిక ఇస్తాయని చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలు, పన్నుల వసూళ్లకు కూడా కమిటీలు సహకరిస్తాయన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగాక వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలన్న నిబంధనల్ని అధికారులు పట్టించుకోలేదని కోర్టుకు తెలిపారు.
2021లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. వార్డు కమిటీల ఏర్పాటుకు డ్రాఫ్ట్ చేసి గవర్నమెంట్‌కు పంపితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని వివరించారు. వార్డు కమిటీలకు బదులుగా మున్సిపల్ అధికారులు 10 మందితో వార్డు ఆఫీసుల్ని ఇటీవల జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రారంభించడం చట్ట వ్యతిరేకమని తెలిపారు. వాదనల తర్వాత ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది.