మల్కాజ్గిరిలో డ్రైనేజీ పనులు పూర్తి చేయండి.. జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశం

మల్కాజ్గిరిలో డ్రైనేజీ పనులు పూర్తి చేయండి.. జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: వర్షాకాలంలో తమ ఇండ్లల్లోకి భారీగా వర్షపు నీరు చేరుతున్నదని మల్కాజ్‌‌గిరిలోని అనంతసరస్వతి నగర్‌‌కు చెందిన రమేశ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌‌ ను హైకోర్టు శుక్రవారం విచారించింది. పిటిషనర్‌‌ తరఫు అడ్వకేట్ వాదిస్తూ..దీనిపై గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని..అయినా అధికారులు పట్టించుకోవడం లేదని కోర్టుకు చెప్పారు. 

జీహెచ్‌‌ఎంసీ తరఫు అడ్వకేట్ వాదిస్తూ.. ఆర్‌‌.కె.పురం, సఫిల్‌‌గూడ నుంచి వరద నీరు పోయేందుకు ప్రస్తుతమున్న డైనేజీ సరిపోవడం లేదని, పూర్తి సామర్థ్యానికి అనుగుణంగా నిర్మాణం చేయాల్సి ఉందని తెలిపారు. అందుకు అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారని, 5 నెలల్లో పనులు పూర్తవుతాయని చెప్పారు. ఇరువాదనలు విన్న కోర్టు..పూర్తి సామర్థ్యంతో  డైనేజీని నిర్మించాలని తెలిపింది. ఈ పనులు ఐదు నెలల్లోనే పూర్తవుతాయని స్పష్టం చేసింది. విచారణను వాయిదా వేసింది.