- ఇందూ ఫార్చ్యూన్ విల్లా అసోసియేషన్‌కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు : కూకట్‌పల్లిలోని ఇందూ ఫార్చ్యూన్ విల్లా కమ్యూనిటీలోని క్లబ్ హౌస్‌లో గ్యాంబ్లింగ్, మద్యం, డ్రగ్స్ తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నాలుగు వారాల్లోగా ఎమర్జెన్సీ జనరల్ బాడీ సమావేశం పెట్టాలని ఓనర్ల అసోసియేషన్స్‌ను ఆదేశించింది. ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ విల్లా ఓనర్స్ అసోసియేషన్‌కు చెందిన క్లబ్ హౌస్‌లో గ్యాంబ్లింగ్, మద్యం, డ్రగ్స్, ఇతర అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఫోన్‌లో, వాట్సాప్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు ల్లేవంటూ అక్కడ నివాసం ఉంటున్న సీహెచ్.హరిగోవింద ఖొరానారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
దీనిని జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారించారు. అసోసియేషన్ సీనియర్ లాయర్ మహేందర్‌రెడ్డి వాదిస్తూ.. ఈ నెల 10న అసోసియేషన్ సమావేశం నిర్వహించామని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించిందన్నారు. అంతేగాకుండా ఈ వ్యవహారాన్ని నిరంతరం పర్యవేక్షించాలని తీర్మానించిందన్నారు. అయితే పిటిషనర్ తరఫు న్యాయవాది కె.మురళీధర్‌రెడ్డి వాదిస్తూ..
పెద్దఎత్తున అక్రమ కార్యకలాపాలు జరుగుతుంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఏమిటని, జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలన్నారు. నాలుగు వారాల్లోగా అత్యవసర జనరల్‌బాడీ మీటింగ్ పెట్టి అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఓనర్స్ అసోసియేషన్‌ను హైకోర్టు ఆదేశించింది, విచారణను సెప్టెంబరు 9వ తేదీకి వాయిదా వేసింది