పోలీసుల నోటీసులపై రెండ్రోజుల్లో స్పందించండి

పోలీసుల నోటీసులపై రెండ్రోజుల్లో స్పందించండి
  • ఫామ్​హౌస్ పార్టీ కేసులో రాజ్ పాకాలకు హైకోర్టు ఆదేశం
  • ఈలోగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆర్డర్​

హైదరాబాద్, వెలుగు : ఫామ్ హౌస్ పార్టీ కేసులో పోలీసులు జారీ చేసిన నోటీసులపై రెండ్రోజుల్లో స్పందించాలని రాజ్ పాకాలను హైకోర్టు ఆదేశించింది. ఈలోగా ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని చెప్పింది. ఈ మేరకు మోకిల్లా ఎస్‌హెచ్‌వో, ఎస్సైలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు చట్టప్రకారం ముందుకెళ్లవచ్చునని తెలిపింది. పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ రాజ్ పాకాల సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్షతో కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అందులో ఆరోపించారు.

ఈ పిటిషన్ పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌ రెడ్డి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.మయూర్‌రెడ్డి వాదిస్తూ.. పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘‘బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను రాజకీయంగా, వ్యక్తిగతంగా దెబ్బతీయడానికే ఆయన బామ్మర్ది రాజ్ పాకాలపై కేసు పెట్టారు. రాజ్ పాకాల ఇటీవల జన్వాడలోని ఇంటికి మారారు. ఈ సందర్భంగా బంధువులు, సన్నిహితులకు పార్టీ ఇచ్చారు. అందులో పిల్లలు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు.

పోలీసులు ఆరోపిస్తున్నట్టుగా పార్టీలో ఎలాంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు లేవు. పిటిషనర్‌తో సహా అందరి మూత్రం శాంపిల్స్‌ ను పోలీసులు తీసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లభించలేదు. కానీ మద్దూరి విజయ్‌ అనే వ్యక్తి కొకైన్‌ సేవించినట్టు టెస్టుల్లో తేలిందని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ నెల 27వ(ఆదివారం)  తేదీతో ఉన్న నోటీసులను 28న (సోమవారం) ఉదయం 9:30 గంటలకు జారీ చేసి, అదే రోజు ఉదయం 11:30 గంటలకల్లా స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశించారు. లేదంటే అరెస్ట్‌ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీన్ని బట్టి అరెస్ట్‌ చేయాలని ముందుగానే సిద్ధమైనట్టు తెలుస్తున్నది” అని అన్నారు. 

ఆధారాలు ఉన్నయ్ : అడిషనల్ ఏజీ  

ఎలాంటి రాజకీయ దురుద్దేశంతో కేసు నమోదు చేయలేదని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ మహమ్మద్‌ ఇమ్రాన్‌ఖాన్‌ తెలిపారు. ‘‘పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించాల్సిన బాధ్యత పిటిషనర్‌పై ఉంది. మద్దూరి విజయ్‌ అనే వ్యక్తి మూత్రాన్ని పరీక్షిస్తే, డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్‌ వచ్చింది. పిటిషనర్‌కు విజయ్‌ సన్నిహితుడు. అతను వెల్లడించిన వివరాల మేరకే కేసు నమోదు చేశాం. కొకైన్‌ వినియోగించినట్టు ఆధారాలు ఉన్నాయి.

ఈ కేసులో లోతుగా విచారణ జరపాల్సి ఉంది. చట్టప్రకారమే ముందుకెళ్తాం. అనుమానితులకు కూడా నోటీసులు జారీ చేస్తాం” అని చెప్పారు. ఇరువైపులా వాదనలు విన్న జడ్జి.. రెండ్రోజుల్లో పోలీసుల నోటీసులపై స్పందించాలని పిటిషనర్ ను ఆదేశించారు. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆర్డర్ ఇచ్చారు. తదుపరి విచారణను నవంబర్ 25కు వాయిదా వేశారు.