ఫీజుల చెల్లింపులపై ఒత్తిడి తేవొద్దు..హైకోర్టు ఆదేశం

ఫీజుల చెల్లింపులపై ఒత్తిడి తేవొద్దు..హైకోర్టు ఆదేశం

పీజీ మెడికల్‌‌‌‌‌‌‌‌ కాలేజీలకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: పీజీ మెడికల్‌‌‌‌‌‌‌‌ కోర్సులకు 2023-25 సంవత్సరానికి సంబంధించి పెంచిన ఫీజుల మొత్తాన్ని చెల్లించాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావొద్దని పీజీ మెడికల్‌‌‌‌‌‌‌‌ కాలేజీలకు గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు అనుమతించిన మేరకే వసూలు చేయాలని, తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా స్టూడెంట్లను తరగతులకు అనుమతించాలని ఆదేశించింది. 

పీజీ మెడికల్, డెంటల్‌‌‌‌‌‌‌‌ కోర్సుల్లో మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కోటా సీట్లకు రూ.5.8 లక్షల నుంచి రూ.24 లక్షలు, కన్వీనర్‌‌‌‌‌‌‌‌ కోటా సీట్లకు రూ.3.2 లక్షల నుంచి రూ.7.75 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌‌‌‌‌ సుజయ్‌‌‌‌‌‌‌‌పాల్, జస్టిస్‌‌‌‌‌‌‌‌ యారా రేణుకల బెంచ్‌‌‌‌‌‌‌‌ విచారణ చేపట్టింది. 

2020-23 మధ్యకాలంలో కూడా ఫీజుల పెంపునకు ఉత్తర్వులు ఇవ్వగా 50- శాతం నుంచి 60 శాతం వసూలు చేయాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని, ప్రస్తుత కేసుకూ అవే ఉత్తర్వులు ఉన్నా స్టూడెంట్లను తరగతులకు అనుమతించడం లేదని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వాదనలను విన్న కోర్టు..ఉత్తర్వుల ప్రకారం ఫీజు వసూలు చేయాలని, మిగిలిన ఫీజు కోసం ఒత్తిడి చేయొద్దని.. స్టూడెంట్లను తరగతులకు అనుమతించాలని ఆదేశిస్తూ విచారణను 10 రోజులకు వాయిదా వేసింది.