కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను ఫైనలైజ్ చేయొద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు యధాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. మాస్టర్ ప్లాన్ కారణంగా భూములు కోల్పోతున్న రైతులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి రైతుల తరఫున వాదనలు విన్నారు. సీనియర్ అడ్వొకేట్ సృజన్ కుమార్ రెడ్డి బాధితుల తరఫున వాదనలు వినిపించారు. సమస్యను పరిష్కరించే మాస్టర్ ప్లాన్ ఫైనలైజ్ చేయొద్దని అభ్యర్థించారు. వారి వాదనలు విన్న న్యాయస్థానం అడ్వకేట్ జనరల్ను విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కేసు విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విచారణకు రైతుల తరఫున కేఏ పాల్ హాజరుకావడం విశేషం.
మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా కామారెడ్డి సరిహద్దు గ్రామమైన రామేశ్వర్ పల్లి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు అయిన రామేశ్వర్ పల్లి గ్రామ రైతులు కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా, తమను సంప్రదించకుండా భూములను రిక్రియేషనల్ జోన్‌గా ప్రకటించడాన్ని రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ రైతులను ఇబ్బంది పెట్టేలా ఉందని, రామేశ్వర్ పల్లి రెవెన్యూ గ్రామంలోని వందల ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టణాభివృద్ధి ప్రాంతంగా చూపించటం అనేక అనుమానాలకు తావిస్తుందని కేసు వేసిన రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకొని రైతుల భూముల జోలికి రావొద్దని కోరారు.