- ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: హైడ్రాకు విస్తృతాధికారాలు ఎందుకు కల్పించారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిల్ పై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావుతో డివిజన్ బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. కాగా, హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ 4ను సవాలు చేస్తూ మాజీ కార్పొరేటర్ మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కుమారుడు) హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆర్డినెన్స్ చట్టవిరుద్ధమని, దాన్ని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.