- బాలల సంరక్షణ కమిటీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు : చట్టవిరుద్ధంగా దత్తత పేరుతో కొనుగోలు చేశారంటూ పోలీసులు స్వాధీనం చేసుకున్న పిల్లల సంరక్షణకు సంబంధించి రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని బాలల సంరక్షణ కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దత్తత నిమిత్తం తల్లిదండ్రులు పెట్టుకున్న దరఖాస్తులపై సంబంధిత అధికారులు 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అక్రమమార్గంలో దత్తత తీసుకున్న పిల్లలను చట్టప్రకారం తల్లిదండ్రులకు అందజేయాలన్న సింగిల్ జడ్జి తీర్పుపై ప్రభుత్వం అప్పీళ్లు దాఖలు చేసింది.
వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. దత్తత నిమిత్తం ప్రతివాదులు పెట్టుకున్న దరఖాస్తులపై సంబంధిత అధికారులు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ అప్పీళ్లపై విచారణను క్లోజ్ చేసింది.