కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయండి : హైకోర్టు

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయండి :  హైకోర్టు
  • సిద్దిపేట తహసీల్దార్లకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: నిర్ణీత గడువు ముగిసి, చెక్కులు ల్యాప్స్‌‌ కాకముందే సిద్దిపేట నియోజకవర్గంలోని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌‌ లబ్ధిదారులకు పంపిణీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌‌ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం లేదంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌‌రావు హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. చిన్నకోడూర్‌‌ 20, నంగ్నూర్‌‌ 38, సిద్దిపేట అర్బన్‌‌ 1, సిద్దిపేట రూరల్‌‌ 19, నారాయణరావు పేట 391.. మొత్తంగా 474 చెక్కులు పంపిణీ చేసేలా కలెక్టర్‌‌ను ఆదేశించాలని కోరారు. 

చెక్కులు సిద్ధంగా ఉన్నా.. మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు చెక్కులు నిలుపదల చేశారన్నారు. ఈ పిటిషన్‌‌పై న్యాయమూర్తి జస్టిస్‌‌ కాజా శరత్‌‌ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌ వాదనలో సత్యం లేదని, చెక్కులు ల్యాప్స్‌‌(చెల్లకుండా) కాలేదని, సెప్టెంబర్‌‌ 29 వరకు సమయం ఉందని ప్రభుత్వ లాయర్‌‌‌‌ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాలని 4 మండలాల తహసీల్దార్లను ఆదేశిస్తూ.. విచారణను ముగించారు.