‘మత్స్యకార’ ఎన్నికలపై నిర్ణయం తీసుకోండి..సహకార సంఘ ఎన్నికల మండలికి హైకోర్టు ఆదేశాలు

‘మత్స్యకార’ ఎన్నికలపై నిర్ణయం తీసుకోండి..సహకార సంఘ ఎన్నికల మండలికి హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల్లోని గ్రామ, జిల్లాల ప్రాథమిక మత్స్యకారుల సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సహకార సంఘ ఎన్నికల మండలికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబరు 23న పిటిషనర్‌‌‌‌ ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలించి.. ఎన్నికల నిర్వహణపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. గడువు ముగిసినా ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ ముత్రాసి/ముదిరాజ్‌‌‌‌ తెగకు చెందిన బి.మల్లేశం మరో ఏడుగురు హైకోర్టులో పిటిషన్‌‌‌‌ వేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌ ఎన్‌‌‌‌వీ శ్రవణ్‌‌‌‌కుమార్‌‌‌‌ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది డీఎల్‌‌‌‌ పాండు వాదనలు వినిపించారు.

మత్స్యకారుల సహకార సంఘాల గడువు పూర్తయి ఐదేండ్లయినా చాలా సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదన్నారు. కేవలం 12 జిల్లాల్లో ఎన్నికలు పూర్తి చేశారని.. మిగిలిన 21 జిల్లాల్లో నిర్వహించలేద తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికిపైగా సొసైటీలకు పాలకవర్గాలు లేక కార్యకలాపాలు కొనసాగడం లేదన్నారు. అనంతరం ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎన్నికలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని సహకార శాఖ ఎన్నికల మండలికి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్‌‌‌‌ లేఖ రాశారని తెలిపారు. మండలి అనుమతి మంజూరు చేసిన వెంటనే ఎన్నికల ప్రక్రియ చేపట్టనున్నట్టు చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. నాలుగు వారాల్లో ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల మండలిని ఆదేశించారు.