
హైదరాబాద్, వెలుగు: మణికొండ జాగీరులోని అక్రమ నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలని, లేని పక్షంలో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మణికొండ జాగీరులో మొత్తం ఎన్ని నిర్మాణాలున్నాయి? ఎన్నింటికి అనుమతులు మంజూరయ్యాయి? అనుమతుల్లేకుండా చేపట్టిన నిర్మాణాలెన్ని? అక్రమ నిర్మాణాలపై ఇప్పటివరకు చేపట్టిన చర్యల వివరాలను సమర్పించాలని ఆదేశించింది.
అనధికారిక, అక్రమ నిర్మాణాలకు విద్యుత్తు, నీటిసరఫరా నిలిపివేయాలంటూ ఏవైనా లేఖలు రాసి ఉంటే వాటి వివరాలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించిన అధికారులపై తీసుకున్న చర్యలపై జులై 2లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మణికొండ జాగీరు గ్రామంలో సర్వే నెం.203/1/3/1, 204 నుంచి 209, 210/1/3ల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ మణినగర్ ప్లాట్ మెంబర్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ సొసైటీ, ఎస్.గోపాల్‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారించిన హైకోర్టు మణికొండ జాగీరులో యథాతథ స్థితిని కొనసాగించాలంటూ 2023 మార్చి 14న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా అధికారులు చర్యలు తీసుకోపోవడాన్ని సవాలు చేస్తూ ఎస్.గోపాల్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు.