
- నాగారం భూముల వివాదంపై కౌంటరు దాఖలు చేయండి
- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: భూదాన్ బోర్డు భూముల కేటాయింపు చట్టబద్ధంగా జరిగిందో లేదో పరిశీలించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే వీటిపై లావాదేవీలు జరిగినందున ప్రజా ప్రయోజనాలను, పార్టీల హక్కులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నంబర్ 181, 182లో ఉన్న 50 ఎకరాలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అప్పటివరకు యథాతథ స్థితిని కొనసాగించాలంది. నాగారంలో 50 ఎకరాల భూమి భూదాన్ బోర్డుకు చెందినదిగా ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలంటూ ఈఐపీఎల్ కన్‌స్ట్రక్షన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ..గతంలో పలు లావాదేవీలను అనుమతించిన అధికారులు ఇప్పుడు ఆ భూములు భూదాన్ బోర్డువని, ప్రభుత్వానికి అప్పగించాలనడం చట్టవిరుద్ధమన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ..పేదలకు కేటాయించడానికే అప్పట్లో దాతలు తమ భూములను భూదాన్ బోర్డుకు అప్పగించారన్న విషయాన్ని విస్మరించరాదన్నారు.. భూములకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించే ముందు చట్టం లక్ష్యంతో పాటు వాటిని స్వాధీనం చేసుకున్న హక్కులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వ వాదనలు వినాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు కౌంటరు దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశిస్తూ.. విచారణను 27కు వాయిదా వేశారు.