1,382 పోస్టులను భర్తీ చేయాల్సిందే .. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

1,382 పోస్టులను భర్తీ చేయాల్సిందే .. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
  • 2008 డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
  • ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​తో సాకులు చెప్పవద్దని సూచన

హైదరాబాద్, వెలుగు: ఎస్జీటీ నియామకాల్లో మిగిలిన పోస్టుల్లో 1,382 పోస్టులను 2008 డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులతో కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌  పద్ధతిన భర్తీ చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో మరోసారి నియామకాలను వాయిదా వేయరాదని స్పష్టం చేసింది. 2024 ఫిబ్రవరిలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనని, దీనిపై మరోసారి గడువు ఇచ్చే అవకాశం లేదని పేర్కొంది. 

నియామకాలు చేపట్టకపోతే ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుందని  విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. 2008 డీఎస్సీకి సంబంధించి పోస్టుల భర్తీకి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, అది పూర్తయ్యేదాకా గడువు ఇవ్వాలంటూ ప్రభుత్వం.. హైకోర్టులో మధ్యంతర పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసింది. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్‌‌‌‌‌‌‌‌  అభినంద్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ షావిలి, జస్టిస్‌‌‌‌‌‌‌‌  తిరుమలాదేవితో కూడిన బెంచ్‌‌‌‌‌‌‌‌  విచారణ చేపట్టింది. 

అడ్వొకేట్‌‌‌‌‌‌‌‌  జనరల్‌‌‌‌‌‌‌‌  ఎ.సుదర్శన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి వాదనలు  వినిపిస్తూ 2008 -డీఎస్సీలో భర్తీకాని ఎస్జీటీ పోస్టులను ఏపీలోలాగా అర్హత సాధించిన బీఈడీ అభ్యర్థులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాలని 2024లో హైకోర్టు ఉత్తర్వుల ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ మేరకు ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. జనవరి 29న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌  విడుదల కావడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, గడువు ముగిసిన వెంటనే నియామక ప్రక్రియను కొనసాగిస్తామని తెలిపారు. దీనికి ధర్మాసనం నిరాకరిస్తూ 2008 నుంచి నియామకాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారని, తమ ఉత్తర్వుల ప్రకారం నియామకాలు  చేపట్టాల్సిందేనని స్పష్టం చేసింది.