హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ వ్యవహారాలపై ఆరు వారాల్లో విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సహకార శాఖ రిజిస్ట్రార్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ సంస్థ అధ్యక్షుడు రవీంద్రనాథ్ అక్రమంగా సభ్యత్వం పొంది ఎన్నికల్లో పాల్గొన్నందున అనర్హత వేటు వేయాలంటూ అక్టోబరు 26న ఇచ్చిన వినతి పత్రంపై సహకార శాఖ రిజిస్ట్రార్ చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ కె. జ్యోతిప్రసాద్ సహా పలువురు హైకోర్టును ఆశ్రయించారు.
దీనిని జస్టిస్ టి. మాధవీదేవి విచారించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు ఇచ్చిన వినతి పత్రంపై తగిన చర్యలు చేపట్టామని, ఇందు కోసం జిల్లా సహకారశాఖ అధికారికి విచారణ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. జూబ్లీహిల్స్ సొసైటీ వ్యవహారాలపై పిటిషనర్ల ఆరోపణలకు సంబంధించి విచారణ చేపట్టారని చెప్పారు. ఇవి వీలైనంత త్వరగా పూర్తవుతాయనగా, పిటిషనర్ల తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ నిర్దిష్ట గడువులోగా విచారణ పూర్తయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి సొసైటీ వ్యవహారాలపై రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ఆరు వారాల్లో వివరాలను పిటిషనర్లకు అందజేయాలని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను మూసివేశారు.