
హైదరాబాద్, వెలుగు: నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారమే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐపీహెచ్‌ఎం) అసిస్టెంట్ డైరెక్టర్ నియామకం చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకసారి నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత ఎంపిక ప్రక్రియను మార్చడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు సాధించిన తనను కాకుండా అదనపు అర్హతలు చేర్చడం ద్వారా మరొకరిని అసిస్టెంట్ డైరెక్టర్‌గా నియమించడాన్ని సవాలు చేస్తూ ఎన్.లావణ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
లావణ్య అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ సింగిల్ జడ్జి తీర్పు వెలువరించగా అప్పీలు దాఖలైంది. ఈ అప్పీలుపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ యారా రేణుకలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం నియామక ప్రక్రియ కొనసాగించాలని ఎన్‌ఐపీహెచ్‌ఎంను ఆదేశించింది.