స్వీపర్ కు వేతన బకాయిలు చెల్లించాల్సిందే.. కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌‌‌లో హైకోర్టు ఆదేశం

  • లేకపోతే హోం శాఖముఖ్యకార్యదర్శి హాజరు కావాలి

హైదరాబాద్, వెలుగు: పోలీసు స్టేషన్‌‌‌‌లో స్వీపర్‌‌‌‌గా చేసిన వ్యక్తికి1991 నుంచి వేతన బకాయిలను చెల్లించాలని హోంశాఖను హైకోర్టు ఆదేశించింది. 2017లో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్​ అమలు చేయకపోతే హోం శాఖ ముఖ్యకార్యదర్శి హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. సూర్యాపేట చిలూకూరు పోలీసు స్టేషన్‌‌‌‌లో స్వీపర్‌‌‌‌గా పనిచేస్తున్న తనకు వేతనం చెల్లించకపోవడంతో షేక్‌‌‌‌ జానీమియా హైకోర్టులో పిటిషన్‌‌‌‌  దాఖలు చేశాడు. ఎస్పీ జారీ చేసిన సర్వీసు సర్టిఫికెట్‌‌‌‌  ఆధారంగా వేతనం చెల్లింపును పరిశీలించాలని సింగిల్‌‌‌‌  జడ్జి ఆదేశాలిచ్చారు. దీనిపై ప్రభుత్వం అప్పీలు దాఖలు చేసి ఉపసంహరించుకున్నా వేతనం చెల్లించలేదు.

దీంతో జానీమియా 2018లో దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌‌‌పై జస్టిస్‌‌‌‌  జె.అనిల్‌‌‌‌ కుమార్‌‌‌‌  ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌‌‌  తరపు న్యాయవాది సీహెచ్‌‌‌‌ గణేశ్‌‌‌‌  వాదిస్తూ ఆరేళ్లు దాటినా కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదన్నారు. కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌‌‌లో సూర్యాపేట ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

ఉత్తర్వుల అమలుకు 3 వారాల గడువు కావాలని ఎస్పీ తరపున ప్రభుత్వ న్యాయవాది కోరడంతో అనుమతించిన న్యాయమూర్తి.. ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయని పక్షంలో హోం శాఖ ముఖ్యకార్యదర్శి హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది.