
- పోలీసులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు : టీజీఎస్ ఆర్టీసీ పేరుతో నకిలీ లోగో తయారు చేశారన్న కేసులో కొణతం దిలీప్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఏడేండ్ల శిక్ష పడే ఆరోపణలు ఉన్నందున సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ ప్రకారం నోటీసులు జారీ చేసి, నిందితుడిని పిలిపించి, విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. ఆర్నేశ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సీఆర్‌పీసీ 41ఏ నిబంధనలను అమలు చేయాలని కోరింది.
పిటిషనర్ దర్యాప్తునకు సహకరించాలని, తనవద్ద ఉన్న ఆధారాలను, సమాచారాన్ని దర్యాప్తు అధికారికి అందజేయాలని చెప్పింది. పిటిషనర్ ఇచ్చిన సమాచారాన్ని కింది కోర్టుకు సమర్పించే నివేదికలో పేర్కొనాలని పోలీసులను ఆదేశించింది. నకిలీ లోగోను సృష్టించి ఆర్టీసీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారంటూ ఎ.శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ కొణతం దిలీప్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల జస్టిస్ సుజన విచారించారు.
పిటిషనర్‌పై అక్రమంగా కేసు నమోదు చేశారని, దీనిపై విచారణ పూర్తయ్యేదాకా అతన్ని అరెస్ట్ చేయొద్దంటూ ఉత్తర్వులివ్వాలని దిలీప్ తరఫు లాయర్ కోర్టును కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఫిర్యాదుదారు శ్రీధర్‌కు, పోలీసులకు నోటీసులు జారీ చేశారు. సమగ్ర వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను జులై 11కు వాయిదా వేశారు.