
- పోలీసు విచారణకు హాజరుకావాల్సిందే: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: షాదీ డాట్ కామ్‌లో నకిలీ ప్రొఫైల్‌తో యువతిని మోసగించిన కేసులో నిందితులైన షాదీ డాట్ కామ్ డైరెక్టర్ అనుపం మిట్టల్, టీం లీడర్ విఘ్నేశ్, మేనేజర్ సతీశ్ నానయ్యలు పోలీసుల విచారణకు హాజరుకావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. వీరిపై నమోదైన కేసును కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరించింది. షాదీ డాట్ కామ్‌లో యానాం ఎమ్మెల్యే ఫొటోతో రాజమండ్రికి చెందిన చెరుకూరి హర్ష అలియాస్ జోగడ వంశీకృష్ణ నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని జూబ్లీహిల్స్ కు చెందిన ఓ యువతిని నమ్మించాడు. ఆమె వద్ద రూ.11 లక్షలు తీసుకున్నాడు. ఈ కేసులో చెరుకూరి హర్షతో పాటు షాదీ డాట్ కామ్ డైరెక్టర్ అనుపమ్ మిట్టల్, తమిళనాడులోని టీం లీడర్ విఘ్నేశ్, బెంగళూరులో ఉన్న మేనేజరు సతీశ్ నానయ్యలను పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ అనుపం, విఘ్నేశ్, సతీశ్ వేర్వేరుగా రెండు పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎన్.తుకారాంజీ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది జి.అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ షాదీ డాట్ కామ్ ప్రొఫెళ్లు నమోదు చేయడానికి వినియోగించే ఒక డిజిటల్ ఫ్లాట్‌ఫాం మాత్రమే అన్నారు. ఇందులో ఉన్న ప్రొఫైళ్లను తనిఖీ చేసే యంత్రాంగం ఏమీ లేదన్నారు.
అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జితేందర్ వీరమల్ల దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ షాదీ డాట్ కామ్‌పై నమ్మకంతో సంప్రదింపులు జరుపుతారని, అందులో జరిగే మోసంతో తమకు సంబంధం లేదనడం సరికాదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయడానికి నిరాకరించారు. పోలీసులు బీఎన్‌ఎస్‌ఎస్ 35(3) కింద నోటీసులు జారీ చేసి చట్టప్రకారం పిటిషనర్లను విచారించాలని ఆదేశిస్తూ పిటిషన్‌లపై విచారణను మూసివేశారు.