మాంజా నిషేధాన్ని అమలు చేయండి..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

మాంజా నిషేధాన్ని అమలు చేయండి..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: గాలిపటాలకు సింథటిక్‌‌ మాంజా/నైలాన్‌‌ దారాలను వినియోగించకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మాంజా దారం తయారీ, విక్రయాలపై నిషేధం విధిస్తూ 2017లో ఢిల్లీలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌‌ ఇచ్చిన తీర్పును కచ్చితంగా అమలు చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల అమలుపై వివరాలు సమర్పించాలంటూ హోంశాఖ, అటవీ, పర్యావరణ శాఖల ముఖ్యకార్యదర్శులకు, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.

విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. మాంజా దారాల తయారీ, విక్రయాలను నిషేధిస్తూ ఎన్జీటీ ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌‌కు చెందిన పి.సంజయ్‌‌ నారాయణ్‌‌ హైకోర్టులో పిటిషన్‌‌ వేశారు. దీన్ని జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డి విచారించారు. పిటిషనర్‌‌ తరఫు అడ్వకేట్ పి.శ్రీరమ్య వాదిస్తూ..సంక్రాంతి సందర్భంగా గాలిపటాల ఎగరవేతకు సింథటిక్, చైనా మాంజా, నైలాన్, గ్లాస్‌‌ కోటెడ్‌‌ దారాల వినియోగం ఎక్కువైందన్నారు. ఈ దారాలతో పాదచారులు, బైకర్లు, పక్షులకు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు.

పర్యావరణ, వన్యప్రాణుల సంరక్షణ చట్టాల కింద పలు రాష్ట్రాల్లో మాంజా తయారీ, విక్రయాలపై నిషేధం ఉందన్నారు. 2017లో ఖాలిద్‌‌ వర్సెస్‌‌ కేంద్రం కేసులో ఎన్జీటీ తీర్పు వెలువరించినా రాష్ట్రంలో అమలు చేస్తున్న దాఖలాలు లేవన్నారు. చైనా మాంజా దారాన్ని విచ్చలవిడిగా వినియోగిస్తున్నారన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. మాంజా వాడాకాన్ని నిషేధిస్తూ ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విచారణను వాయిదా వేశారు.