హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ చేపట్టిన సభ్యత్వ నమోదు ప్రక్రియను నిలిపివేస్తూ గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా సభ్యత్వ నమోదు చేపట్టరాదని పేర్కొంది. దీంతోపాటు గండిపేట మండలం మంచిరేవులలో జూబ్లీహిల్స్- 4 పేరిట చేపట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపార ఒప్పందం అమలును కూడా కొనసాగించరాదంటూ తెలిపింది.
జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ సొసైటీ అక్రమాలపై రెండు సార్లు ఫిర్యాదు చేసినా సహకార సంఘాల రిజిస్ట్రార్ చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ కె.జ్యోతిప్రసాద్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి.మాధవీదేవి గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు అడ్వకేట్వాదిస్తూ.. కొత్త సభ్యత్వాల నమోదు కోసం దరఖాస్తులను ఆహ్వానించారని, ఇది రిజిస్ట్రార్ ఉత్తర్వులకు విరుద్ధమన్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా ఇప్పటికే ఒక వెంచర్ వేసి ప్లాట్లు కేటాయించారని, ప్లాట్లు రావాల్సినవారు 1,800 మంది ఉండగా, మరో 800 సభ్యత్వాలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారన్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. వాదనలను విన్న జడ్జి.. సభ్యత్వాలతోపాటు రియల్ ఎస్టేట్ ఒప్పందాల అమలుపై స్టే ఇచ్చారు. ప్రతివాదులైన సహకారశాఖ ముఖ్యకార్యదర్శి, సహకార సంఘాల రిజిస్ట్రార్, జూబ్లీహిల్స్ సొసైటీకి నోటీసులు జారీ చేస్తూ కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించారు.