హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మీర్‌పేట చెరువు ఎఫ్‌టీఎల్ ఏరియాలో ఆక్రమణలను తొలగించేందుకు తీసుకునే చర్యల గురించి వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల, రెవెన్యూ శాఖల ముఖ్యకార్యదర్శులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, కందుకూరు ఆర్డీవో, బాలాపూర్ తహసీల్దార్, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లలకు నోటీసులు జారీ చేసింది. విచారణను జులై నెలకు వాయిదా వేస్తూ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మీర్‌పేట పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్, శిఖం పరిధిలో సర్వే నంబర్ 46, 61లోని ఆక్రమణను తొలగించాలని, ఎఫ్‌టీఎల్ భూములకు రక్షణ కల్పిస్తూ, ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో నాలాను క్లియర్ చేయాలని, చెరువు అభివృద్ధికి కమిటీని ఏర్పాటు నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మీర్‌పేట పెద్ద చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్ పరిధిలో ఆక్రమణల నిర్మూలనకు ఏం చర్యలు చేపట్టారో చెప్పాలని కోరింది. జులై 20వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్రమ నిర్మాణాలకు అండగా ఉన్న అధికారులు, ఇతరులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్‌కు చెందిన ఆకుల పద్మమ్మ దాఖలు చేసిన పిల్ తరఫున సీనియర్ అడ్వొకేట్ రచనారెడ్డి వాదించారు. చిన్నగా ప్రారంభించిన ఆక్రమణల్లో తర్వాత పెద్ద నిర్మాణాలు చేస్తున్నారని చెప్పారు. చెరువులో చెత్త డంపింగ్ ద్వారా పర్యావరణ చట్టాల ఉల్లంఘన జరుగుతోందన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలను పాటించడం లేదని చెప్పారు.