ఆస్పత్రుల్లో సౌకర్యాలపై నివేదికివ్వండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఆస్పత్రుల్లో సౌకర్యాలపై నివేదికివ్వండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనపై నివేదిక సమర్పించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ నెల 23లోగా  సమగ్ర నివేదికను అందజేయాలని స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సదుపాయాలను కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ కె.అఖిల్‌‌ శ్రీగురుతేజ దాఖలు చేసిన పిల్‌‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ జె.శ్రీనివాసరావుల బెంచ్‌‌ ఇటీవల విచారించింది.

 పిటిషనర్‌‌ తరఫు లాయర్​వాదిస్తూ భారత వైద్య ప్రమాణాలు-2022 ప్రకారం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఖాళీలను భర్తీ చేయాలని కోర్టుకు తెలిపారు. కానీ ఎక్కడా సౌలతులు సరిగ్గాలేవన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదిస్తూ..మౌలిక వసతుల కల్పనపై నివేదిక సమర్పించడానికి గడువు కావాలని కోరారు. దీనికి ధర్మాసనం అనుమతించింది. కన్సల్టేషన్‌‌ గదులు, డయాలసిస్‌‌ యూనిట్‌‌లు, హెచ్‌‌డీయూ, ఐసీయూ బెడ్‌‌లు తదితర విభాగాల ఏర్పాటుపైనా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.