ఖైదీ మృతికి పరిహారం చెల్లించండి : హైకోర్టు

ఖైదీ మృతికి పరిహారం చెల్లించండి : హైకోర్టు
  • జైల్లో ఖైదీ హత్యపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
  • వారికీ హక్కులుంటాయని తీర్పు
  • ఖైదీల ప్రాణాలు కాపాడే బాధ్యత ఆఫీసర్లదేనని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల రక్షణ బాధ్యత ఆఫీసర్లదేనని, వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లితే ప్రభుత్వం మృతుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద ఖైదీలకు కూడా హక్కులు ఉన్నాయని చెప్పింది. చట్టం పరిధిలో మినహాయింపులు తప్ప రాజ్యాంగ పరమైన హక్కులను కాదనేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది. 

అంతేకాకుండా జైలు మాన్యువల్, ఇతర రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారం కూడా ఖైదీల రక్షణ బాధ్యత జైలు అధికారులదేనని జస్టిస్‌‌‌‌ సీవీ భాస్కర్‌‌‌‌రెడ్డి ఇటీవల తీర్పు చెప్పారు. అధికారులు తమ బాధ్యత నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. చరపల్లి జైలులో ఉంటున్న యావజ్జీవ శిక్ష పడిన కరోళ్ల వెంకయ్య తోటి ఖైదీ దాడిలో మృతిచెందాడు. తన భర్త మృతికి పరిహారంగా తనకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని వెంకయ్య భార్య కరోళ్ల జయమ్మ హైకోర్టులో పిటిషన్‌‌‌‌ వేశారు.

విరిగిన కత్తెరతో దాడి

చర్లపల్లి జైలులోనే ఉండే దాసరి నరసింహులు అనే ఖైదీ జైల్లోని బార్బర్‌‌‌‌  వద్ద విరిగిపోయిన కత్తెరను తస్కరించి అక్కడే చెట్ల పొదల్లో దాచాడు. 2012 జులై 4న తెల్లవారుజామున ఆ కత్తెరతో వెంకయ్యతో పాటు మరో ఆరుగురు ఖైదీలపై దాడి చేశాడు. దాడిలో వెంకయ్య మరణించాడు. ఈ ఘటనపై మేజిస్టీరియల్‌‌‌‌ విచారణ జరిపిన కలెక్టర్‌‌‌‌ 2013 డిసెంబరు 19న నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా జాతీయ మానవ హక్కుల కమిషన్‌‌‌‌ బాధితుడి కుటుంబానికి రూ. లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం 2018లో రూ లక్ష జయమ్మకు చెల్లించింది. దీనిపై సంతృప్తి చెందని జయమ్మ హైకోర్టులో పిటిషన్‌‌‌‌ను దాఖలు చేసింది.

నైపుణ్యం లేదు కాబట్టి 7.20 లక్షలు ఇవ్వండి 

వెంకయ్య వయస్సు 55 ఏండ్లు కాగా అతని ఆదాయం వివరాలను ఎక్కడా పేర్కొనలేదని  తెలిపింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నైపుణ్యం లేని కార్మికులకు నెలకు రూ.7200 చెల్లించాలన్న నిబంధన ప్రకారం ఏడాదికి రూ 88,400లో మూడో వంతు సొంత ఖర్చులు పోగా మిగిలిన రూ. 57,600ను 11 ఏండ్లకు లెక్కగట్టి రూ. 6,33,600 చెల్లించాలని .. దీనికి తోడు అంత్యక్రియల ఖర్చుల కింద మరో రూ 84 వేలు కలిపి రూ.7.20 లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పింది ఇప్పటికే ఇచ్చిన రూ.లక్షను మినహాయించిమిగిలిన మొత్తానికి ఆరు శాతం వడ్డీతో జమ చేసి ఇవ్వాలని ఆదేశించింది.