కనీస వేతన గెజిట్‌‌ 4 వారాల్లో పబ్లిష్‌‌ చేయండి .. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

కనీస వేతన గెజిట్‌‌ 4 వారాల్లో పబ్లిష్‌‌ చేయండి .. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: కనీస వేతనాలపై గెజిట్‌‌ ప్రింట్‌‌ చేయాలని గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను నాలుగు వారాల్లో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లేకుంటే  సంబంధిత అధికారులంతా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. విచారణను ఏప్రిల్‌‌ 4కు వాయిదా వేసింది.  ఐదేండ్లకోసారి కనీస వేతనాలను సవరిస్తూ గెజిట్‌‌ విడుదల చేయాల్సి ఉండగా, 2007 తర్వాత ఇప్పటివరకు మళ్లీ ఇవ్వలేదని పేర్కొంటూ తెలంగాణ రీజినల్‌‌ ట్రేడ్‌‌ యూనియన్‌‌ కౌన్సిల్‌‌ 2023లో పిల్‌‌ దాఖలు చేసింది. దీన్ని యాక్టింగ్‌‌ చీఫ్‌‌ జస్టిస్‌‌ సుజయ్‌‌పాల్‌‌ ఆధ్వర్యంలోని డివిజన్‌‌ బెంచ్‌‌ విచారించింది. 

పిటిషన్‌‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌‌ వాదిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాల పెంపుపై వివిధ ప్రభుత్వ శాఖలు జీవోలు చేసి చేతులు దులుపుకున్నాయన్నారు. కోటి మందికిపైగా కార్మికులు ప్రభుత్వ చర్యలతో నష్టపోతున్నారని చెప్పారు. వాదనలు విన్న సీజే ధర్మాసనం.. వెంటనే గెజిట్‌‌ ప్రింట్‌‌ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మిక శాఖ కమిషనర్, ప్రింటింగ్‌‌ అండ్‌‌ స్టేషనరీ కమిషనర్‌‌ను ఆదేశిస్తూ 2023లోనే ఉత్తర్వులు జారీ చేసింది.

 6 వారాలు సమయం ఇచ్చినా అమలు చేయలేదంటూ పిటిషనర్‌‌ మరోసారి కోర్టును ఆశ్రయించి.. ధిక్కరణ పిటిషన్‌‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ సుజయ్‌‌పాల్, జస్టిస్‌‌ ఎన్వీ శ్రవణ్‌‌కుమార్‌‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. తాము ఇచ్చిన ఆదేశాలను 4 వారాల్లో అమలు చేయాలని లేకుంటే.. సీఎస్‌‌ సహా ఇతర కార్మిక అధికారులు తమ ముందు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది.