
హైదరాబాద్, వెలుగు: ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల్లో భాగంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు భూకేటాయింపులకు సంబంధించి నమోదు చేసిన కేసులో మాజీ ఐఏఎస్ అధికారి, ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ బీపీ ఆచార్య ప్రాసిక్యూషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరుకు సంబంధించిన వివరాలను సమర్పించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ను హైకోర్టు బుధవారం ఆదేశించింది. దీంతోపాటు హెటిరో కేసులో ఆచార్యకు, ఇండియా సిమెంట్స్ కేసులో ఆదిత్యనాథ్ దాస్‌కు అనుమతులు ఏవైనా మంజూరయ్యాయో లేదో చెప్పాలని సూచించింది.
లేపాక్షి వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ బీపీ ఆచార్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సీఆర్‌పీసీ సెక్షన్ 197 కింద ప్రాసిక్యూషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరని పేర్కొన్నారు. హెటిరో వ్యవహారంలో ఇదే పిటిషనర్‌పై, ఇండియా సిమెంట్స్‌లో మాజీ ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్‌పై కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించిందన్నారు.
అయితే ప్రాసిక్యూషన్‌కు అనుమతి అవసరం లేదంటూ హైకోర్టు తీర్పుపై ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువరించిందని, అయితే ప్రాసిక్యూషన్‌కు తాజాగా అనుమతులు తీసుకుని కింది కోర్టును ఆశ్రయించవచ్చంటూ ఈడీకి సూచించిందని గుర్తుచేశారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వుల అనంతరం ఈ కేసుల్లో అనుమతులు ఏవైనా మంజూరయ్యాయో లేదో చెప్పాలని పేర్కొంది. తదుపరి విచారణను ఈనెల మూడో వారానికి వాయిదా వేసింది.