- ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఫార్మా సిటీ కొనసాగిస్తున్నారో.. లేదో.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓ వైపు ఫార్మా సిటీ రద్దయినా.. సీఎం, మంత్రులు ప్రకటనలు చేస్తున్నారని, అధికారులు స్పష్టత ఇవ్వడంలో విఫలం అవుతున్నారని తెలిపింది. ఫార్మా సిటీ కొనసాగింపుపై స్పష్టత ఇస్తే.. పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేస్తామని తేల్చి చెప్పింది.
ఫార్మా సిటీ భూములను మరే ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారా.. లేదా.. అన్న అంశంపై స్పష్టత ఇస్తూ ఈ నెల 20లోగా కౌంటరు దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. కౌంటరు గడువుకు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. ఫార్మా సిటీ ఏర్పాటు కోసం సేకరించిన భూముల పరిహార అవార్డు చెల్లదంటూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో తమ భూములపై ఆంక్షలు ఎత్తేయాలని కోరుతూ మేడిపల్లికి చెందిన రామచంద్రయ్యతో పాటు మరికొంత మంది హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.దివ్య వాదనలు వినిపించారు. అక్కడ బల్క్ డ్రగ్ యూనిట్‌లు ఏర్పాటు చేయడం లేదని, లైఫ్ సైన్సెస్ పార్క్ వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయన్నారు. రైతుల తరఫు అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ.. ఫార్మా సిటీ రద్దు చేస్తున్నట్లు సీఎం అసెంబ్లీలో ప్రకటించారన్నారు. అదేవిధంగా, ఫార్మా సిటీ ఉండదని మంత్రి ప్రకటించారని తెలిపారు. దీనికి సంబంధించిన పత్రికా కథనాలను పరిశీలించాలని కోరారు. అంతేగాకుండా కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోలో కూడా ఫార్మా సిటీని రద్దు చేస్తున్నట్లు హామీ ఇచ్చిందన్నారు. వాదనలు విన్న జడ్జి.. ఈ వ్యవహారంపై కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు.