తెలంగాణ ప్రభుత్వం 563 పోస్టులతో గ్రూప్-1 నోటిపికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 23 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో వయోపరిమితిని పెంచుతూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 'గ్రూప్-1' నోటిఫికేషన్‌తోపాటు టీఎస్‌పీఎస్సీ విడుదల చేసే తర్వాతి నోటిఫికేషన్స్ లోనూ వయోపరిమితిని 44 నుంచి 46 సంవత్సరాలకు పెంచారు. ఈ వయోపరిమితిని 46 నుంచి 51ఏళ్లకు పెంచాలని ఆదేశాలు జారీ చేయాలంటూ ఎ.శ్రీనివాసరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే రెండు సార్లు గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగినా ఓ సారి పేపర్ లీక్, మరో సారి ఇతర కారణాలతో హైకోర్టు రద్దు చేసింది. మరో సారి వయోపరిమితి పెంచాలని ఇప్పుడు పిటిషన్ దాఖలైంది.
హైకోర్టు ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 28న విచారణ జరిపిన వయోపరిమితిని పెంచాలన్న నిరుద్యోగుల వినతి పత్రాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2017 నుంచి ఎలాంటి నోటిఫికేషన్ విడుదల కానందునా వయోపరిమితి 46 నుంచి 51 వరకు పెంచేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఎ.శ్రీనివాసరెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2017 నుంచి నియామక నోటిఫికేషన్ జారీ కాలేదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్లు ఇచ్చిన వినతి పత్రాన్ని చట్ట ప్రకారం 4 వారాల్లో పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.
ALSO READ :- జర్నలిస్టులకు ఇండ్ల జాగాలు ఇచ్చేలా కృషి చేస్త: మీడియా అకాడమీ చైర్మన్