సీడీపీవో పోస్టుల ఎంపికను మూడు నెలల్లో కంప్లీట్​ చేయాలి : TSPSECకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఐసీడీఎస్‌‌ పరిధిలోని 54 చైల్డ్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ ప్రాజెక్టు ఆఫీసర్‌‌ (సీడీపీఓ) పోస్టులతోపాటు మహిళా శిశు సంక్షేమశాఖలోని ఎక్స్​టెన్షన్​ ఆఫీసర్‌‌ (సూపర్‌‌వైజర్‌‌) గ్రేడ్‌‌–1 పోస్టుల ఎంపిక ప్రక్రియను మూడు నెలల్లోగా  పూర్తి చేయాలని టీఎస్‌‌పీఎస్సీకి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 5న జారీ చేసిన నోటిఫికేషన్‌‌ ప్రకారం సీడీపీవోల పోస్టుల భర్తీకి సంబంధించి.. నియామక ప్రక్రియ పూర్తయినప్పటికీ నియామకాలు పూర్తి చేయలేదంటూ నిఖిత సహా 13 మంది హైకోర్టును ఆశ్రయించారు.  

నవంబర్‌‌లో జారీ అయిన నోటిఫికేషన్‌‌ ప్రకారం మహిళా శిశు సంక్షేమశాఖలో సూపర్‌‌వైజర్‌‌ పోస్టులను భర్తీ చేయకపోవడాన్ని సవాల్‌‌ చేస్తూ సంహిత సహా నలుగురు మరో పిటిషన్‌‌ దాఖలు చేశారు. వీటిని ఇటీవల జస్టిస్‌‌ పి. మాధవీదేవి విచారించారు. పిటిషనర్ల తరఫు అడ్వొకేట్ బిల్లా రమేశ్‌‌ వాదనలు వినిపిస్తూ.. నోటిఫికేషన్‌‌ ఆధారంగా కమిషన్‌‌ నియామక ప్రక్రియ చేపట్టిందని, మెరిట్‌‌ లిస్ట్‌‌ ప్రకటించడంతోపాటు సర్టిఫికెట్ల పరిశీలన కూడా అయ్యిందని చెప్పారు. వేరే పోస్టుల భర్తీకి చెందిన ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా వీటిని నియమించకపోవడం అన్యాయమన్నారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియపై ఎలాంటి లీకేజ్‌‌ ఆరోపణలు లేవన్నారు.

ALSO READ : ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు.. 4 నెలల్లో పరిహారం ఇవ్వాలి

టీఎస్​పీఎస్సీ తరఫు అడ్వొకేట్​ ఎం రాంగోపాల రావు వాదనలు వినిపిస్తూ.. గ్రూప్‌‌–1, డివిజనల్‌‌ అకౌంట్స్‌‌ ఆఫీసర్‌‌ గ్రేడ్‌‌ 2, ఏఈఈ పోస్టులకు చెందిన పరీక్ష పత్రాలు లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని. అందువల్ల నియామకాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలిపారు. వాదనలు విన్న జడ్జి.. సెప్టెంబర్​ నాటికి సీడీపీవో, సూపర్‌‌వైజర్‌‌ పోస్టుల భర్తీ ప్రక్రియ వ్యవహారంపై లీకేజీ ఆరోపణలు లేనందున వీటి విషయంలో నిలిపివేత నిర్ణయం సరికాదన్నారు. మూడు నెలల్లోగా సీడీపీవోల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని టీఎస్​పీఎస్సీని ఆదేశించిన జడ్జి పిటిషన్లపై విచారణను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.