హైదరాబాద్, వెలుగు : కాకతీయ యూనివర్సిటీ పీహెచ్‌డీ అడ్మిషన్ల ప్రక్రియను నిలుపుదల చేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పాత నోటిఫికేషన్ మెరిట్ లిస్టుతో కొత్త సీట్లు ఎలా భర్తీ చేస్తున్నారంటూ దాఖలైన కేసులో ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా పీజీ ఉత్తీర్ణులైన వాళ్ల పరిస్థితి ఏం కావాలో వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశించింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న సీట్లకు మించి ఒక్క సీటు కూడా ఎక్కువగా భర్తీ చేయరాదంది.
పాత నోటిఫికేషన్ ద్వారా కొత్త సీట్ల భర్తీకి కాకతీయ వర్సిటీ ఈ నెల 16న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ హనుమకొండకు చెందిన చల్లా అమరేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ టి. వినోద్ కుమార్ బుధవారం విచారించారు.
కొత్త సీట్లకు మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసి అర్హులందరికీ సమాన అవకాశం కల్పించాలని న్యాయవాది అఖిల్ వాదించారు. వర్సిటీ తరఫున పి. భానుప్రకాశ్ వాదించారు. ప్రభుత్వ వాదనల తర్వాత హైకోర్టు.. ఈ నెల 16న రిజిస్ట్రార్ జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలుపుదల చేసింది. విచారణను వాయిదా వేసింది.