
- తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: భూవివాదానికి సంబంధించి చేవెళ్ల, మోకిలా పోలీసు స్టేషన్‌లలో నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఆయన భార్య ఎ.రజిత, తల్లి ఎ.రాజు బాయి హైకోర్టులో దాఖలు చేసిన వేర్వేరు ముందస్తు బెయిలు పిటిషన్‌లపై మంగళవారం వాదనలు ముగిశాయి. వాదనలను విన్న హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది.
రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లిలో 20 ఎకరాల భూమికి సంబధించిన వివాదంలో తమ భూమిని ఆక్రమించారని, తాను నిర్మించిన ఫంక్షన్ హాలును కూల్చివేయడంతోపాటు ఆయుధాలతో బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఎస్.దామోదర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసుల్లో ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ జీవన్‌రెడ్డి, భార్య ఎ.రజిత, తల్లి ఎ.రాజుబాయి పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఫిర్యాదుదారును గాయపరచలేదని, ఎలాంటి గాయాలు లేవన్నారు.
ఈ కేసులను కొట్టివేయాలంటూ గతంలో పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్‌లను ఇదే హైకోర్టు కొట్టివేస్తూ అరెస్ట్ చేయరాదంటూ రక్షణ కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు. వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.