ఫోన్‌‌ ట్యాపింగ్ కేసులో శ్రవణ్‌‌ కుమార్‌‌  బెయిల్‌‌పై తీర్పు వాయిదా

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో 6వ నిందితుడైన ఒక టీవీ చానల్‌‌ ఎండీ శ్రవణ్‌‌ కుమార్‌‌ రావు ముందస్తు బెయిల్‌‌ పిటిషన్‌‌పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ మేరకు బుధవారం జస్టిస్‌‌ కె.సుజన విచారణ పూర్తి చేసి తీర్పును వాయిదా వేశారు. శ్రవణ్‌‌ కుమార్‌‌‌‌ దాఖలు చేసిన ఈ పిటిషన్‌‌ ను  గత నెల 28న జస్టిస్‌‌ రాధారాణి విచారించి, తీర్పును  వాయిదా వేశారు. ఈలోగా కేసుల విచారణ బెంచ్‌‌లు మారడంతో జస్టిస్‌‌ కె.సుజన వద్ద మరోసారి విచారణకు వచ్చింది.

పబ్లిక్‌‌ ప్రాసిక్యూటర్‌‌ వాదనలు వినిపిస్తూ.. గత బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వంలో మంత్రి హరీశ్‌‌ రావు ఆదేశాలతో ఓ టీవీ చానల్‌‌కు చెందిన శ్రవణ్‌‌ కుమార్‌‌ రావు ఎస్‌‌ఐబీ అధికారులతో కలిసి కుట్రలో భాగస్వామి అయ్యారని ఆరోపించారు. శ్రవణ్‌‌ రావును విచారించాల్సిన అవసరం ఉందని, దీంతో ఆయనకు బెయిల్ మంజూరు చేయొద్దని కోరారు. పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఈ కుట్రతో పిటిషనర్‌‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. దర్యాప్తు సంస్థ అరెస్ట్‌‌ చేయడానికి ఆయన క్రిమినల్‌‌ కాదన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పు వాయిదా వేశారు.