బండి సంజయ్‌పై కేసు కొట్టివేత .. ఉత్తర్వులు వెలువరించిన హైకోర్టు

బండి సంజయ్‌పై కేసు కొట్టివేత .. ఉత్తర్వులు వెలువరించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా 2020లో నమోదైన కేసును గురువారం హైకోర్టు కొట్టేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ సికింద్రాబాద్‌ మార్కెట్‌ పోలీసు స్టేషన్‌లో బండి సంజయ్‌పై కేసు నమోదైంది. దీనిని దర్యాప్తు చేసిన పోలీసులు అభియోగ పత్రం దాఖలు చేయగా ప్రస్తుతం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఆ కేసు పెండింగ్‌లో ఉంది.

 దీన్ని కొట్టేయాలంటూ బండి సంజయ్‌ వేసిన పిటిషన్‌ పై జస్టిస్‌ కె. లక్ష్మణ్‌ తాజాగా విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పోలీసులు అసత్యాలతో కేసు నమోదు చేశారని, పోలీసుల దర్యాప్తు మొక్కుబడిగా ఉందని, సాక్షుల వాంగ్మూలాల్లో ఒకదానికొకటి పొంతన లేదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. పిటిషనర్‌పై మోపిన అభియోగాలకు సరైన కారణాలు లేవంటూ బండి సంజయ్‌పై ఉన్న కేసును కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.