
- ఒకదానిపైనే దర్యాప్తు చేయాలన్న హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో భూసేకరణ వివాదానికి సంబంధించి బొమ్రాస్‌పేట పోలీసులు నమోదు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌లను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ ఘటనకు సంబంధించి నమోదైన ఒక ఎఫ్‌ఐఆర్‌పైనే దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. భూసేకరణ వివాదంలో అధికారులపై దాడులు చేశారంటూ బొమ్రాస్‌పేట పోలీసులు ఎఫ్‌ఐఆర్ (నెం.153) నమోదు చేశారు. ఇదే ఆరోపణలపై మరో రెండు ఎఫ్‌ఆఐర్‌లు 154, 155 నమోదు చేయగా.. పలువురు రైతులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టి సోమవారం తీర్పు వెలువరించారు. ఒకే ఘటనకు సంబంధించి వేర్వేరు కేసులు నమోదు చేయడం సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధమని పేర్కొన్నారు. పోలీసులg నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ 154, 155లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసుల్లోని ఫిర్యాదులు, స్టేట్‌మెంట్‌లను మొదటి కేసులో ఆధారాలుగా తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది.