జీవోలు ఇచ్చి.. చెత్తబుట్టలో వేస్తరా?

  • రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
  • ఏపీ డెయిరీ  ఆస్తుల వివాదంపై  ముగిసిన వాదనలు  తీర్పు వాయిదా
  • అవి ఇచ్చేది అటెండరో.. గుమాస్తానో కాదు కదా?
  • తీర్పు వాయిదా వేసిన డివిజన్ బెంచ్

హైదరాబాద్, వెలుగు: ‘జీవో ఇస్తారు.. చెత్త బుట్టలో వేశామంటారు..మళ్లీ జీవో ఇస్తారు. జీవోలిచ్చేది అటెండరో, గుమాస్తానో కాదు కదా’ అని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. ఏపీ డెయిరీ డెవలప్‌‌మెంట్‌‌ కార్పొరేషన్‌‌ లిమిటెడ్‌‌ (ఏపీడీడీసీఎల్) ఆస్తుల వివాదంపై దాఖలైన రిట్ పిటిషన్ పై జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్ లతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. తెలంగాణ సర్కార్‌‌ జీవో 8ని జారీ చేసి చెత్తబుట్టలో వేసిందని, తర్వాత మరో జీవో 17ను జారీ చేసిందని.. పాత జీవోకు, కొత్త జీవోకు ఏమీ పొంతన లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 8 ఇచ్చిన తర్వాత అది చెల్లుబాటులో లేదని, డస్ట్‌‌బిన్‌‌ లో వేశామంటే ఏమనుకోవాలని నిలదీసింది. ఈ నిర్ణయం తీసుకున్నదేమీ అటెండరో, గుమస్తానో కాదని, ముఖ్య కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారి తీసుకున్న నిర్ణయమని గుర్తు చేసింది. ఒకసారి ఆస్తుల శాశ్వత కేటాయింపు అని, మరోసారి తాత్కాలిక కేటాయింపు అని పరస్పర విరుద్ధంగా చెప్పడం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఆస్తుల వివాదాన్ని కేంద్రమే పరిష్కరించాలి: తెలంగాణ ఏజీ

పునర్‌‌వ్యస్థీకరణ చట్టంలోని  47(4), 66, 71 సెక్షన్ల ప్రకారం తెలంగాణ–ఏపీ మధ్య వివాదాన్ని పరిష్కరించే అధికారం కేంద్రానికి ఉందని తెలంగాణ  ఏజీ బీఎస్‌‌ ప్రసాద్‌‌ చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు..  కేంద్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉన్నట్లు చట్టంలో లేదని చెప్పింది. రెండు రాష్ట్రాల మధ్య లేదా, రాష్ట్రం–కేంద్రం మధ్య వివాదం వస్తే సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని రాజ్యాంగం స్పష్టం చేస్తోందని తెలిపింది. అయినా తాము కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తే రెండు రాష్ట్రాలకు చెందిన హోం శాఖలో స్టాఫ్‌‌ సీనియార్టీ వివాదాన్ని పరిష్కరించాలని చెప్పినా చేయలేదని గుర్తు చేసింది. ‘ఈ వివాదంలో కేంద్రానిది పెద్దన్న పాత్రే. ఇదే సమస్యపై మీటింగ్‌‌ జరిగితే  ఇరుపక్షాలుగా  ఉండేది తెలంగాణ, ఏపీలే. మీరే సెటిల్‌‌ చేసుకునేందుకు చొరవ చూపాలి. కేంద్రానికి ఉన్న అధికారం పరిమితమే’నని బెంచ్ స్పష్టం చేసింది.

తెలంగాణ జీవో అన్యాయం: ఏపీ ఏజీ

ఏపీ ఏజీ ఎస్‌‌.శ్రీరామ్‌‌ వాదిస్తూ..  ఫునర్‌‌ వ్యవస్థీకరణ చట్టంలోని 9వ షెడ్యూల్‌‌ కింద ఆస్తుల పంపకాలు జరగకపోయినా లాలాపేటలోని కార్పొరేషన్‌‌ ఇండస్ట్రీ తెలంగాణకే చెందుతుందని జీవో జారీ చేయడం అన్యాయమన్నారు. కార్పొరేషన్‌‌ తెలంగాణ భూభాగంలో ఉంటే అది తెలంగాణది కాబోదన్నారు. దీనిపై తెలంగాణ ఏజీ  బీఎస్‌‌ ప్రసాద్‌‌ వాదిస్తూ.. లాలాపేటలో ఉన్నది మెయిన్‌‌ ఆఫీస్‌‌ కాదు కాబట్టి తెలంగాణదే అవుతుందని చెప్పారు. ఏపీలోని సెంటర్లపై తమకు హక్కు కావాలని కోరడం లేదని స్పష్టం చేశారు. రోజువారీ విధుల కోసమే తాత్కాలిక విభజన జరిగిందన్నారు. ఆ చట్టంలోని 47(4), 66, 71 సెక్షన్ల ప్రకారం ఆస్తుల వివాదాన్ని పరిష్కరించే అధికారం  కేంద్రానికి ఉందని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు ముగియడంతో  తీర్పును వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది.