వీధి కుక్కల నియంత్రణకు ఏం చర్యలు తీసుకున్నారు : హైకోర్టు

వీధి కుక్కల నియంత్రణకు ఏం చర్యలు తీసుకున్నారు : హైకోర్టు

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
చర్యలు తీసుకుంటే నివేదిక సమర్పించాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: పిల్లలు, ప్రజలపై దాడులు చేస్తూ వారి మృతికి కారణమవుతున్న వీధి కుక్కల నియంత్రణకు ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి చేపట్టిన చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విచారణను ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది. వీధికుక్కల నియంత్రణకు సరైన చర్యలు చేపట్టడం లేదని, వాటికి వ్యాక్సినేషన్‌‌  చేయడంలేదని, సరైన ఆహారం లేక అవి మనుషులపై దాడి చేస్తున్నాయని  వనస్థలిపురానికి చెందిన విక్రమాదిత్య పిల్  దాఖలు చేశారు.

గత ఏడాది ఫిబ్రవరి 19న హైదరాబాద్‌‌  బాగ్‌‌ అంబర్‌‌పేటలో పాఠశాల విద్యార్థిపై కుక్కలు దాడి చేయడంతో మృతి చెందిన సంఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ పిటిషన్‌‌లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌  జె.అనిల్‌‌ కుమార్‌‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గత నెల 29న సంగారెడ్డి జిల్లా పటాన్‌‌చెరులో బిహార్‌‌  నుంచి వలసవచ్చిన భవన నిర్మాణ కార్మిక దంపతుల ఆరేళ్ల కుమారుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చిన్నారి చనిపోయిన సంఘటనపై బెంచ్  ఆందోళన వ్యక్తం చేసింది.

కుక్కకాటు వల్ల మృతి చెందిన పిల్లల కుటుంబాలకు పరిహారం చెల్లించి బాధ్యత తీరిందని భావించరాదని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కొన్ని విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. పిల్లలపై కుక్కలు తరచూ దాడులు చేస్తూ వారి మృతికి కారణమవుతున్నా ప్రభుత్వం చేపట్టిన నామమాత్రపు చర్యలపై అసహనం వ్యక్తం చేసింది. అనుపమ్‌‌  త్రిపాఠి వర్సెస్‌‌  యూనియన్‌‌ ఆఫ్‌‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, దానికి సంబంధించిన నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జాతీయ జంతు సంక్షేమ మండలిని హైకోర్టును ఆదేశించింది.

చెట్ల పరిరక్షణకు చట్టం ఉందా?

కర్నాటకలో చెట్ల పరిరక్షణకు ప్రత్యేకంగా చట్టం ఉందని అలాంటి చట్టం తెలంగాణలో ఉందా? అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఒకవేళ అలాంటి చట్టం, నిబంధనలు ఉంటే వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. జనాభాకు తగ్గట్టుగా చెట్ల పెంపకం, పార్కులు, పచ్చదనం ఉండటం లేదని, పార్కులకు కేటాయించిన స్థలాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ కే.ప్రతాప్‌‌రెడ్డి పిల్‌‌ దాఖలు చేశా రు. దీన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ ఆలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ జె.అనిల్‌‌కుమార్‌‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది.

పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..ప్రజలు సేద తీరడానికి కనీసం పార్కులు కూడా లేవని, ఉన్నవాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవడం లేదని కోర్టుకు తెలిపారు. వాదనలను విన్న బెంచ్​ పార్కుల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఆదేశించింది. అదేవిధంగా కర్నాటకలో ప్రత్యేకంగా చెట్ల పరిరక్షణకు 1976లో చట్టాన్ని తీసుకువచ్చారని..అలాం టి చట్టం ఏదైనా ఉంటే చెప్పాలని ఆదేశించారు.