- 15 నిమిషాల గ్యాప్‌లో షోలు వేస్తే ప్రేక్షకులు ఎలా వెళ్తారు?
- ఇష్టారీతిన సినిమా ప్రదర్శన కరెక్ట్ కాదని వ్యాఖ్య
- గేమ్ ఛేంజర్‌కు తెల్లవారుజామున షోలకు
- పర్మిషన్‌పై పిటిషన్లు.. విచారణ నేటికి వాయిదా
హైదరాబాద్, వెలుగు: సినిమాల ప్రదర్శనకు వేళాపాళా ఉండదా? ఎప్పుడుపడితే అప్పుడు సినిమా షోలు ఏంటి? అని హైకోర్టు ప్రశ్నించింది. దిల్ రాజు నిర్మాతగా, శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా.. తెల్లవారుజామున 4.30 గంటల షోకు అనుమతిస్తూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఇచ్చిన మెమోను సవాలు చేస్తూ 2పిటిషన్లు దాఖలయ్యాయి.
వీటిని గురువారం జస్టిస్ బీ విజయ్‌సేన్ రెడ్డి విచారించారు. ఈ సందర్భంగా కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. రెగ్యులేషన్స్ రూల్స్ 1970, సినిమాస్ లైసెన్సింగ్ షరతులకు విరుద్ధమని తెలిపింది. అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా ఎప్పడు పడితే అప్పుడు సినిమా షోలకు అనుమతివ్వడం మానవహక్కుల ఉల్లంఘన లాంటిదేనని అభిప్రాయపడింది.
రాత్రి పూట నిద్రపోవాలని, ఇది ఆరోగ్య కోణంలో మానవ హక్కు కిందికే వస్తుందని చెప్పింది. అర్ధరాత్రి దాటిన తర్వాత, తెల్లవారుజామున 16 ఏండ్లలోపు వాళ్లకు అనుమతివ్వడం సబబు కాదని వ్యాఖ్యనించింది.
ఒక షో తర్వాత మరో షోకి మధ్య పావుగంట మాత్రమే సమయం ఉంటే.. థియేటర్‌లోకి వెళ్లేవాళ్లు, వచ్చేవాళ్లకు ఆ టైం ఎలా సరిపోతుందని ప్రశ్నించింది. అలాంటి సమయాల్లోనే తొక్కిసలాటలు జరుగుతాయని పేర్కొంది.
పుష్ప–2 సినిమా సమయంలో సంధ్య థియేటర్ వద్ద, తిరుపతిలో జరిగిన ఘటనలపై ఆవేదన వ్యక్తం చేసింది. పాపులర్ ఫిల్మ్ స్టార్ నటించిన సినిమాను నెలరోజులపాటు చూసేందుకు జనం వస్తారని, ఒకేరోజు అనేక షోలు ఎందుకు ప్రదర్శించాలని ప్రశ్నించింది. రాష్ట్రంలో సినిమా షోలకు ఇష్టారీతిన అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఏముందని అడిగింది.
అభ్యంతరముంటే థియేటర్ల వద్ద ధర్నాలు చేయాలి
విచారణ సందర్భంగా హైకోర్టు.. పిటిషనర్లకు పలు ప్రశ్నలు సంధించింది. వాస్తవానికి ఇది పిల్ కిందకు వస్తుందని, మీరెందుకు పిల్ వేయరని ప్రశ్నించింది. అనేకమంది తెల్లవారుజామునే కాకుండా అర్ధరాత్రి షోలకు కూడా వెళ్లేందుకు సుముఖంగా ఉన్నప్పుడు మీకొచ్చిన సష్టమేమిటని కూడా అడిగింది.
అభ్యంతరం ఉంటే థియేటర్ల ఎదుట ధర్నాలు చేయాలని వ్యాఖ్యానించింది. అలాగే, సినిమా రిలీజ్‌కు ముందు కేసులు వేయడంతో సరిపెట్టొద్దని, ఆ తర్వాత కూడా లాజికల్ ఎండ్ కోసం ప్రయత్నం చేయాలని సూచించింది.
ఈ రెండు పిటిషన్లు, సంధ్య థియేటర్ ఘటనపై దాఖలైన పిటిషన్ తో కలిపి శుక్రవారం విచారణ చేపడతామని జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి గురువారం ఉత్తర్వులిచ్చారు. తొలుత లాయర్లు మహేశ్ మామిండ్ల, సుల్తాన్ భాషా, విజయ్ గోపాల్ వాదించారు.
సినిమాటోగ్రఫీ యాక్ట్ సెక్షన్ 12 ప్రకారం ఉదయం 8.30 గంటల నుంచి మాత్రమే సినిమా షోలకు అనుమతివ్వాలన్నారు. జిల్లాల్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, హైదరాబాద్‌లో పోలీస్ కమిషనర్ మాత్రమే టిక్కెట్ల ధరల పెంపునకు జీవో 120 ద్వారా అనుమతి ఇవ్వాలన్నారు.
ఆ జీవోను ఉదహరించి సినిమా షోల గురించి రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేయడం చెల్లదన్నారు. జీవోలో టిక్కెట్ల ధరల పెంపు అంశం మాత్రమే ఉందని, సినిమా ఏ సమయంలో ప్రదర్శించాలనే అంశం లేకపోయినా ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా మెమో ఇచ్చిందన్నారు.