
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ భూమిగా చెప్తున్న 25 ఎకరాల్లో కేవలం 200 చదరపు గజాల ప్లాట్‌కు మాత్రం కలెక్టర్ ఎన్వోసీ ఎలా జారీ చేస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏ నిబంధన కింద కలెక్టర్ ఎన్వోసీ జారీ చేశారో చెప్పాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ నౌకల్సా గ్రామంలో ప్రశాంతిహిల్స్‌లోని సర్వే నెం.66/2లోని 200 చదరపు గజాల ప్లాట్‌కు 2023 సెప్టెంబరు 9న కలెక్టర్ ఎన్వోసీ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ ఆళ్లగడ్డ చెన్నమ్మ హైకోర్టులో పిటిషన్ వేశారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ సర్వే నంబర్లో 600 చదరపు గజాల స్థలాన్ని సాదా బైనామా కింద కొనుగోలు చేసి క్రమబద్ధీకరించుకున్నారన్నారు. ప్రభుత్వానికి చెందినదంటున్న ఈ భూమిపై నాగా కో ఆపరేటివ్ సొసైటీతో వివాదం నడుస్తోందన్నారు. ఓవైపు వివాదం నడుస్తుండగా 200 చదరపు గజాల 211/బి ప్లాట్‌కు సంబంధించి ప్రభుత్వ మాజీ ఉద్యోగి కామిరెడ్డి మృత్యుంజయరెడ్డికి ఎన్వోసీ జారీ చేశారన్నారు.
ఎన్వోసీ జారీలో నిబంధనలను అమలు చేయలేదన్నారు. కాగా, దీనిపై కౌంటరు దాఖలు చేయడానికి ప్రభుత్వ న్యాయవాది గడువు కోరడంతో న్యాయమూర్తి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. ఏ నిబంధన కింద కలెక్టర్ ఎన్వోసీ జారీ చేశారో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
ఈ కేసులో అనుమానాలున్నాయని, ప్రజాప్రయోజనాలకు చెందిన ఈ విషయంలో కౌంటర్ దాఖలు చేయని పక్షంలో సీబీఐ, ఈడీ విచారణకు అప్పగించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ ఉత్తర్వుల కాపీని ప్రత్యేక మెసెంజర్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపాలన్నారు. అంతేకాకుండా ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి పిటిషనర్ దరఖాస్తు చేసినా అనుమతించొద్దని రిజిస్ట్రీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 20కి న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి వాయిదా వేశారు.