
- కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరు పిటిషన్‌పై హైకోర్టు కామెంట్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ గైర్హాజరు అంశం స్పీకర్ పరిధిలోనిదని, ఇందులో కోర్టులు ఎలా జోక్యం చేసుకుంటాయని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై న్యాయ సమీక్ష చేయడానికి ఉన్న అవకాశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. ప్రతిపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యేందుకు చర్యలు తీసుకునేలా స్పీకర్, స్పీకర్ ఆఫీస్‌కు ఉత్తర్వులు జారీ చేయాలంటూ తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడువిజయ్‌పాల్ రెడ్డి ఇటీవల హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకల బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు లాయర్ వాదిస్తూ.. 2023లో కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఎంపికైనప్పటి నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
నారోగ్యంతో కేసీఆర్ హాజరుకాలేకపోతే మరొకరికి ఆ బాధ్యతను అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఇది స్పీకర్ పరిధిలోని అంశమని, తామెలా జోక్యం చేసుకోగలమని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై న్యాయ సమీక్ష ఎలా చేయగలమని ప్రశ్నించగా.. గడువిస్తే వివరాలిస్తానని పిటిషనర్ చెప్పడంతో విచారణను వాయిదా వేసింది.